కార్తీకమాస కృత్యములలో ప్రధానమైనవి
విష్ణు ప్రబోధోత్సవం
తులసీదామోదరుల కళ్యాణం.
ఆషాడశుద్ధ ఏకాదశి నాడు శయన ఏకాదశి మొదలైన చాతుర్మాస్య వ్రతం కార్తీకమాసం లో శుద్ధ ఏకాదశి నాడు చేసే ప్రబోబోధోత్సవంతో పూర్తి ఔతుంది.
ప్రబోధోత్సవం కార్తీక శు. ఏకాదశి అని కొన్ని గ్రంధాలలో ఉంటే శ్రీరామార్చన చంద్రికాది కొన్ని గ్రంధాలలో ద్వాదశినాడు చేయాలని ఉంది. ఏకాదశి నాడు పారణములేదు కనుక ద్వాదశి మొదలు పౌర్ణమి వరకూ ఏనాడైనా చేయవచ్చు అని మా అభిప్రాయం.
ఉదయం చేయాలా? సాయంత్రం చేయాలా?
ఉదయకాలమందే చేయుట యుక్తంగా కనిపిస్తోంది.
ఏకాదశి ఉపవాసం చేసి మరునాడు ఉదయం విష్ణు ప్రబోధోత్సవం తులసీదామోదరుల కళ్యాణం తదుపరి ద్వాదశి పారణం . ఇది వనంలో చేసే ఆచారముగా ఉండుటచేత అదే వనసమారాధనంగా జనబాహుళ్యంలో ప్రసిద్ధమైనది.
ప్రబోధోత్సవ సంకల్పం
శ్రీ దామోదర కైంకర్యతా సిధ్యర్ధం ప్రబోధోత్సవం తదనంరం తులసీదామోదర కళ్యాణం యధాశక్త్యా కరిష్యే... ప్రధమతః విష్ణు ప్రబోధనం కరిష్యే...
అని సంకల్పం. చెప్పి... ఈ క్రింది విధంగా విష్ణు ప్రబోధనం చేయాలి...
బ్రహ్మేంద్ర రుద్రాది కుభేర సూర్య సోమాదిభిర్వందిత వందనీయ
బుధ్యస్వ దేవేశ జగన్నివాస మంత్ర ప్రభావేన సుఖేన దేవ
భావం: బ్రహ్మ ఇంద్ర రుద్ర కుబేర సూర్య చంద్రులచే నమస్కరించబడే దేవేశ...! జగన్నివాసా...! వేదమంత్రములచే మేలుకొలుపు చేయబడి సుఖముగా మేలుకొనుము.
ఇయంచ ద్వాదశీ దేవ ప్రబోధార్ధంతు నిర్మితా
త్వయైవ సర్వలోకానాం హితార్ధం శేషశాయినా
భావం : ఓ స్వామీ! శేషశాయివైన నీచేత సర్వలోక హితముకోసం నీ ప్రబోధనము కోసం ఈ ద్వాదశి ఏర్పాటు చేయబడింది.
ఉత్తిష్టోత్తిష్ట గోవింద త్యజనిద్రాం జగత్పతే
త్వయిసుప్తే జగత్సుప్తం ఉత్తితేచ ఉత్తితం జగత్
భావం : వేదములచే స్తుతించబడేవాడా (గోవింద) జగత్పతే! నిద్రను విడచి మేల్కొనుము. నీవు మేల్కొన్నచో లోకములు మేల్కొనును. నీవు నిద్రిస్తే లోకములు నిద్రపోవును.
అని మేల్కొలిపి... పుష్పములు సమర్పించాలి ఇలా...
గతా మేఘా వియచ్చైవ నిర్మితం నిర్మలా దిశః
శారదానిచ పుష్పాణి గృహాణ మమ కేశవ
భావం : మేఘములు తొలగిపోయినవి. ఆకాశమంతా నిర్మలమైనది. దిక్కులు ప్రకాశవంతమైనవి. శరత్కాలపుష్పములు ఇవిగో స్వీకరించుము. ఈవిధంగా పుష్పాంజలి సమర్పించి...
శ్రీమహావిష్ణువే దామోదరాయ శ్రీదేవ్యై తులస్యైనమః
అనే మంత్రం తో అర్ఘ్య పాద్యాది షోడశోపచారములు సమర్పించిన తరువాత ...
తులసీ దామోదర కళ్యాణం జరిపించుటకు వేదికపై తులసిమొక్కను, దామోదరుడైన విష్ణువు లేక కృష్ణ ప్రతిమనుగానీ ఉంచాలి. లేకుంటే ఉసిరిక చెట్టునే దామోదరునిగా భావనచేసి తులసి మొక్కను ఉంచి ... మధ్యలో తెర ఉంచి మంగళాష్టక శ్లోకాలు పఠించి తెరతీసి పుష్పములు చల్లి , దామోదరునికి తులసిమాతను పాణిగ్రహణం జరిపించాలి.
దేవీం కనకసంపన్నాం కనకాభరణ భూషితాం
దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మ లోక జిగీషయా...
మయా సంవర్ధితాం యథాశక్త్యాలంకృతాం ఇమాం తులసీదేవీం దామోదరాయ శ్రీధరాయవరాయ తుభ్యంఅహం సంప్రదధే...!
అని అక్షతలు పుష్పములు కల జలమును ఉసిరికచెట్టుమొదట విడువవలెను.
తరువాత విష్ణు చతుర్వింశతి నామాలు, తులసీ అష్టోత్తరశతనామాలతో అర్చన చేసి, నైవేద్యం సమర్పించి సమారాధనమగా ప్రసాదం స్వీకరించాలి .
ఉసిరిక వృక్షం వనంలో ఉంటుంది కనుక ఇది వనంలోనే జరుగుతుంది కనుక దీనినే కార్తీక వన సమారాధనం అంటారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి