శ్రీవిష్ణుసహస్రనామ భాష్యం
వేదంలో ఉన్న పదాలకు అర్థాలు చెప్పేది నిరుక్తం
ఆపదాలకు విశేషాలను పురాణ ఇతిహాసాలలో దొరుకుతాయి...
విష్ణు సహస్రనామాలు వేదముయొక్క సారాంశం గా అందించబడినాయి.
ఈశ్వరః (ఓం ఈశ్వరాయ నమః)
నిరుక్తము
మనుష్యాద్యవతారేపి బ్రహ్మాదీంశ్చ ప్రయోజనే
నియంతాత్వీశ్వరః ప్రోక్తః ప్రాధాన్య ఫలదో మనుః
మనుష్యులుగానో దేవతలుగానో జంతువుగానో అవతరించినప్పటికీ ... బ్రహ్మ రుద్ర ఇంద్ర మొదలైన దేవతలను తన అవతార ప్రయోజనమును సాధించకోవడానికి వినియోగించుకునే సామర్థ్యం కలవాడు కనుక విష్ణువుని ఈశ్వర అనే నామముతో కీర్తించారు.
ఈశ్వరత్వం అంటే శాసించగల ఐశ్వర్యం కలవాడు అని అర్ధం.
విష్ణువు ధరించే అన్ని అవతారాలలో ఇది మనకు కనిపిస్తుంది.
భగవద్గుణదర్పణము
ఈష్టే ఇతి ఈశ్వరః - శాసకుడైన వాడు. తనకన్నా వేరొక శాసకుడులేనివాడు కనుక పరమపదంలో ఉన్న నారాయణుని పరమేష్ఠి అని వ్యవహరిస్తారు. అక్కడ కన్నా అవతారాలలో తన ఐశ్వర్యం ఎక్కువ కలవాడు కనుక ఈశ్వర అనునది విష్ణువుయోక్క గుణమును తెలియజేసేనామము.
అవజానంతి మాం మూఢాః, మానుషీంతనుం ఆశ్రితం।
పరంభావం అజానంతః , మమ భూతమహేశ్వరమ్।। భ.గీత. 9-11
భావం: లోకములను రక్షించుటకై మనుష్యురూపముతో అవతరించిన నా ప్రభావమును మూర్ఖులు తెలుసుకోలేకపోవుచున్నారు. సర్వభూతములను శాసించే మహేశ్వరుడిని నేనే అని తెలియక నన్ను అవమానించుచున్నారు.
అజోఽపిసన్నవ్యయాత్మా , భూతానాం ఈశ్వరోపి సన్ ।
ప్రకృతిం స్వామధిష్ఠాయ, సంభవామ్యాత్మమాయయా ।। (భ.గీత. 4-6)
భావం : నేను జన్మరహితుడను, నిత్యుడను, సర్వప్రాణులనూ శాసించువాడను (ఈశ్వరః అనగా శాసించేవాడు) ఐనను ప్రకృతిని నా అధీనమందుంచుకుని నామాయచేత నేను అవతరింతును.
శాంకరభాష్యం
నిరుపాదికం ఐశ్వర్యం అస్య అస్తిః - ఉపాదిలేకయే సిద్ధించిన ఐశ్వర్యం ఈశ్వరత్వం ఈతనికి కలదు సృష్టి మొదలగు కార్యములు నిర్వహించుటకు ఏ ఉపాదితో పనిలేనివాడు . అదే అతని ఈశ్వరత్వం .
ఈశ్ - ఐశ్వర్యే .. వరచ్ ప్రత్యయం. కలసి ఈశ్వర శబ్దం ఏర్పడుతుంది.
ఏషః సర్వేశ్వరః ఏషః సర్వజ్ఞః ఏషో అంతర్యామ్యేవ (మాండూక్య ఉపనిషత్ 6వ మంత్రం)
ఇవన్నీ పరమాత్మ యైన శ్రీమన్నారాయణని యందే అన్వయించుట చేతనూ...
శ్రీమన్నారాయణుడే అంతర్యామి యైన భగవంతుడు ఐనందుననూ ...
శ్రీమన్నారాయణుడైన విష్ణువే జగత్కళ్యాణార్ధం అనేక అవతారములు ధరించి బ్రహ్మాది దేవతలను కూడా శాసిస్తున్న కారణముచేతనూ...
ఈశ్వర శబ్దం నారాయణుడైన విష్ణువునకే చెందిన నామము
తప్ప పరిమితితో కూడిన ఐశ్వర్యం (శాసించే శక్తి పరిమితిగా కల పార్వతీ నాథునకో, భూత గణేశ్వరునికో, విఘ్నగణములకో శాసకులైనవారికి చెందినది కాదు)
ఈశ్వర అనుపదం అక్కడ ఉన్నంతమాత్రాన ఈశ్వర అనిపేరుగల వారినందరినీ స్మరించేది ఆ స్తోత్రం అనుకోవడం అవివేకం.

ఈశ్వరసంహితా పేరుతో నారాయణుని ఆరాథనాదులను తెలుపు సంహిత కూడా ఉన్నది
రిప్లయితొలగించండి