భగవద్రామానుజ సహస్రాబ్ది శుభాకాంక్షలు 
అనంతవైభవమ్ 1 (భగవద్రామానుజ చరిత్ర)
  • శ్రీమన్నారాయణునికి శయ్యగా పాదుకలుగా గొడుగుగా వింజామరగా అమరి నిత్యము భగవంతుని సేవలో ఉండికూడా తృప్తిచెందక సర్వజగత్తునకు భగవంతుని శ్రీపాదముల సౌందర్య సౌకుమార్య మాదుర్యములను తెలయజేసి, ఆసక్తికలిగించి , మోక్షాసక్తులనుగావించి అనుగ్రహించాలని అవతరించిన ఆదిసేషులే భగవద్రామానుజులు.
  • అవతార పవిత్రస్థలం : శ్రీపెరుంబుదూరు (మద్రాసుకి దగ్గర)
  • జననీజనకులు : ఆసూరి కేశవాచార్యులు (యజ్వికూడా) కాంతిమతీదేవి.
  • గోత్రము : హారీతగోత్రము
  • అవతారమ్ : కలియుగాది 4118 పింగళనామ సంవత్సరం , వైశాఖమాసం, ఆరుద్రా నక్షత్రమ్ (క్రీ.శ.1017)
  • ఆచార్య పరంపర : శ్రీ యామునాచార్య పరంపర (నమ్మాళ్వారులచే అనుగ్రహించబడిన నాథమునులకు పౌతృలు)
  • పంచసంస్కారములు : మహాపూర్ణులచే
  • సన్యాసదీక్ష : కాంచీపురములోని దేవరాజసన్నిధిలో
  • అనుగ్రహం : ఆసేతు సీతనగ పర్యంతము శ్రీపతి ఆలయ పునరుద్ధరణము
  • శ్రీవైదికసంప్రదాయ సముద్ధరణము.
  • అవైదిక నాస్తిక మాయద్వైత కాలుష్యములను తొలగించు విశిష్టాద్వైత సిద్ధాంతస్థాపనము.

భగవత్కైంకర్యము :

  • 74 మంది పీఠాధిపతులను,
  • నల్వరు సింహాసనస్తులను
  • 774 మంది యతులను
  • 1200 మంది ఏకాంగులను ఏర్పరిచారు భగత్సేవకై.


ఆదిశేషుడే శ్రీరామానుజులు :- శ్రీకరమైన పర్వతము కనుక వేంకటాచలమును శ్రీశైలము అంటారు. వేంకటాచలమున శ్రీనివాసుని నిత్యము సేవించుకుంటూ ఉండేవారు పెదతిరుమలాచార్యులు. వీరిని తిమలనంబియని, శ్రీశైలపూర్ణులని కూడా అంటారు. వేంకటేశ్వరుడు ఇతనిని తండ్రిగా భావించెనట . అందువలన ఈతనిని "పితామహస్యాపి పితామహః" తాతగారికి తాత అంటారు. వీరి సోదరి కాంతిమతీదేవిగారు. కేశవాచార్యులధర్మపత్నియామె. కాంతిమతిగారికి పుత్రుడు ఉదయించాడని తిరుమలనంబిగారు వచ్చారు మేనల్లుని చూచారు! ఆశ్చర్యము ! ఆదిశేషుడిగా కనిపించాడా శిశువు! "ఇలయాళ్వారె" (లక్ష్మణస్వామీ) అన్నారు. రామునికి తమ్ముడు అనగా అనుజుడు కదా! అలా ఆశిశువుకు " రామానుజ"అని నామకరణం చేశారు. వారే భగవద్రామానుజులు.

     భగవద్రామానుజులు చిన్నవయస్సులో కాంచీపురమునందున్న "యాదవప్రకాశ మిశ్రులు"అను అద్వైత సన్యాసిదగ్గర విద్యాభ్యాసం  చేస్తున్నారు. యాదవప్రకాశులు మంత్రతంత్రాలు బాగాతెలిసినవారు.

     ఆదేశమునేలే రాజకుమార్తెకు దెయ్యము పట్టింది. యాదవప్రకాశులు ఆదెయ్యమును వదిలించుటకు ప్రయత్నించారు. అప్పుడారాజకుమార్తెపైనున్న దయ్యము "రామానుజులు ఆనంతుడైన ఆదిశేశుని అవతారము. వారి పాదతీర్ధము ఇస్తే నాకు ప్రేతత్వము పోయి పరమపదం పొందుతాను. అప్పుడీరాజపుత్రి విముక్తురాలగును."అని చెప్పింది. అట్లుచేయగా ఆరాజపుత్రిక దెయ్యమునుండి విముక్తమయ్యింది. ఈ విధముగా ఆదిశేశుడే రామానుజులని లోకానికి ప్రకటితమైంది.

 శ్రీ రామానుజుల ప్రజ్ఞాప్రదర్శన :-  భగవద్రామానుజులు  గురువుగారయిన యాదవప్రకాశ మిశ్రులకు ఒకరోజు  అభ్యంగన సేవ  చేస్తున్నారు .  ఎవరో అడిగారు  ''యధా కప్యాసం పుండరీకమేవాక్షిణీ '' అను వాక్యమునకు  భావం చెప్పమని .  

సహజముగా నారాయణునియందు ద్వేషం కల స్మార్త సన్యాసి అతడు. కోతిపిర్రలవలే ఎర్రనైన కనులు కలవాడని అర్ధంచెప్పారట యాదవప్రకాశులు. రామానుజులు చాలా బాధపడ్డారు. భగవంతుని నేత్రాలను కోతిపిర్రలతో పోలుస్తారా...? వినమ్రంగానే అడిగారు యాదవప్రకాశులను. అలాగే ఉంది కదా ! అన్నారు యాదవప్రకాశులు.

కం అంటే జలము. కం పిబతి - జలమును త్రాగేది కపి... అంటే కలువతూడు.
కప్యాసం పుండరీకం అంటే కలువ తూడుపై ఉన్న కలువ . 

నీటిలో తూడుపై ఉన్న అందమైన కలువపూవువంటి కన్నులు కలవాడు అని అర్ధంచెప్పారు రామానుజులు.

భగవద్రామానుజులపై హత్యాప్రయత్నం

కంచి వరదరాజస్వామివారి అనుగ్రహం


అనేకరకములుగా రామానుజుల ఔన్నత్యము సహించలేని యాదవప్రకాశులు ఆలోచించారు "ఎలాగైనా రామానుజులను అంతంచేయాలి. లేకపోతే తమసిద్ధాంతమూ తనప్రతిష్ట దెబ్బతింటాయి ." ఇలా ఆలోచించి కాశీవెళ్ళి అక్కడ గంగానదిలో మనిగిపోయేట్టు చెయ్యాలని కాశీయాత్రకు బయలుదేరారు - శిష్యసమేతంగా - అద్వైతసిద్దాంతాచార్యులు యాదవప్రకాశమిశ్రులు. 

మార్గమధ్యలో పెద్ద అడవి. ఆయడవిమధ్యలో రామానుజులుకి వారికుట్రగురించి తెలిసింది. అర్ధరాత్రి తప్పించుకున్నారు. ఎటువెళ్ళాలో తెలియక త్రోవతప్పిపోయారు.

కోయదంపతులు ఇద్దరు కనిపించి తాము కాంచీపురం వెల్తున్నామని కాంచీపురం వరదరాజస్వామి దేవాలయానికి తీసుకవచ్చి గుడిలోప్రవేశించి మాయమైపోయారు.

కాంచీపూర్ణులు అక్కడ వరదరాజస్వామివారి దేవాలయములో నిత్యసేవలు చేసేవారు. అనుమహానుభావులు వరదరాజస్వామివారికి ఏకాంతసేవకులు. అక్కడ ఈ కోయదంపతులు ఏమయ్యారా అని ఆలోచిస్తున్న రామానుజులతో "తమరిని ఇక్కడికి తీసుకొనివచ్చినవారు వరదరాజస్వామియే. స్వామివారిసేవ చేస్తూ తమరిక్కడే ఉండండి. ఇది భగవంతుని ఆజ్ఞ." అని తగిన ఏర్పాట్లు చేశారు. అలా కొంతకాలం ఉన్నారు శ్రీరామానుజులవారు.

శ్రీరామానుజచరిత్ర అనంతవైభవమ్ శీర్శికతో వరుసగా పెట్టబడుతోంది. 

చదవండి ఎక్కువమందికి టేగ్చేయండి.
ఆచార్యసేవలో తరిద్దామ్.

భగవద్రామానుజ సహస్రాబ్ది శుభాకాంక్షలతో . . .

శ్రీవైష్ణవాచారవిశిష్టులైన భాగవతులెల్లరకూ సవినయ దాసోహములతో
శ్రీమాన్ జనార్దన రామానుజ దాసు
 




కామెంట్‌లు