భద్రాచలం


భద్రాచలం లోని రాముడు. రామనారాయణుడే 

బ్రహ్మపురాణాంతర్గత భద్రాచలక్షేత్ర మహత్యం సారాంశం. 

శ్రీమన్నారాయణుడు రామావతారం చాలించి తన స్వస్థానం పొందిన తరువాత చాలా సంవత్సరాల గడిచిన తదుపరి ....భద్రుడు శ్రీరామభక్తుడై చక్కగా తపస్సు చేశాడు. భద్రుడు మేరుపర్వతరాజకుమారుడు . 

భద్రుడిని అనుగ్రహించడానికి శ్రీమన్నారాయణుడు తన నిజస్వరూపం ధరించి ప్రత్యక్షమయ్యాడు. నాలుగు భజములతో ... శంఖచక్రములు ధనుర్బాణాలు ధరించి .... వామాంకమున (ఎడమతొడపై) అమ్మవారిని కూర్చొండబెట్టుకుని... ఆదిశేషుడు లక్ష్మణుడై ప్రక్కనే ధనుర్బాణాలు ధరించి సావధానుడై ఉండగా (సావధానుడు=ఎలర్టుగా ఉన్నవాడు) ప్రత్యక్షమయ్యాడు. భద్రుడు భక్తితో ప్రసీదతు దేవనాథేతి ననామచ సహస్రశః నాయందు అనుగ్రహం చూపమని అనేక విధముల కొనియాడాడు. ఇంకా ఆ పురాణం నందలి భద్రుని చేయబడిన స్తోత్రం నుండి కొన్ని ముఖ్యమైన శ్లోకాలు చూడండి. 

 నమస్తే దేవదేవేశ శంఖ చక్ర గధాధర , ధనుర్బాణధరానంత రామచంద్ర నమోఽస్తు తే।। 

 భావం : శంఖచక్రములు ధనుర్బాణాలు ధరించిన దేవదేవునికి కూడా శాసనకర్తవైన అనంతా..రామచంద్రా నీకు నమోనమః (దేవదేవుడు - దేవతలకుదేవుడు బ్రహ్మ, బ్రహ్మను శాసించే నారాయణుడు దేవదేవేశుడు. కనుక నారాయణుడినే స్తుతించాడు భద్రుడు) 

 వైకుంఠవాసిభిః దృశ్య చరణాంబుజ సత్తమ ! కథం మమాద్యదృష్ట జడబుద్ధేః జడాకృతేః।। 

 భావం: వైకుంఠ వాసులైన నిత్యసూరులు ముక్తపురుషులచే సేవించబడే పాదపద్మాలు కల వాడా ! జడబుద్ధిని పర్వతరూపినీ ఐన నాకు ఎట్లు దర్శనం ఇచ్చితివి..! ఇది నా పూర్వ జన్మ సుకృతం కదా...! (ఇక్కడ కూడా వైకుంఠవాసి విష్ణు స్వరూపంగానే కీర్తించాడు భద్రుడు. ) 

 రామ రాఘవ దశరథాత్మజ పదాలకు విశేషార్ధాలు 

 రామః :- రమ్ ధాతు నిష్పన్నః రామః - అనంద స్వరూపమైన 'రమ్' అనే సంస్కృత ధాతువుచే ఏర్పడింది రామ అనే పదం. రమ్ ధాతువు ఆనందమనే అర్ధం లో, క్రీడ అనే అర్థంలో కూడా వాడబడుతోంది. రామ అంటే ఆనందమే స్వరూపముగా కలవాడు. "ఆనందో బ్రహ్మ"  వేదవాక్కు. కనుక ఆనందమే తనరూపముగా కల పరమాత్మ శ్రీమన్నారాయణుడే రాముడంటే... పరమపదంలో ఉన్న శ్రీమన్నారాయణుని, వ్యూహంలోని వాసుదేవుని, విభవంలోని విష్ణువుని కూడా రామః అనే వ్యవహరిస్తారు. "రమంతే యత్రయోగినః తద్రామః " యోగులు ధ్యన నిమగ్నులై ఏ పరబ్రహ్మ తత్వాన్ని ద్యానంచేస్తూ ఆనందపరవశులౌతారో ఆ తత్వం రామ ! అది వేదప్రతిపాదితమైన నారాయణ తత్వమే..! వేదమే రామాయణం ....! నారాయణుడు రాముడు...! అందుకే దశరధ కుమారుడై రాముడు అవతరించకపూర్వమే రామాయణం ఉందనేది. రామస్య అయనం రామాయణం రామునియొక్క మార్గమును తెలిపేది కనుక రామాయణం ...! పరమాత్మ శ్రీమన్నారాయణుని మార్గమును, ఆయన పరతత్వాన్ని విశదీకరించేది వేదము కనుక ... వేదమునకు రామాయణమునకు పోలిక .

వేదము రామాయణంగా వాల్మీకి మహర్షి నోటివెంట రామాయణమై వెలువడితే ...! శ్రీమన్నారాయణుడే దశరథునికి కుమారుడై రాముడుగా అవతరించాడు...! ఆశ్రీమన్నారాయణుడే రావణసంహారంచేసి లోకాలను ఆనందంపచేయడానికి అవతరించిన కారణంగానే రామః అనేపేరు సార్ధకం అయ్యింది. 

ఆవిషయం ముందుగానే ఋషులకు తెలుసు. సుమంత్రునికీ తెలుసు. రామునికన్నా ముందుగానే రామాయణం ఉంది అనడానికి కారణమదే. 

 రాఘవా :- నృధాతు నిష్పన్నః ర - నృ అనగా నశించేది, నశింపచేసేది. అఘ అనగా పాపము లేక కష్టాలు. పాపమును పోగొట్టువాడు కనుక రాఘవుడు. 

 దశరథాత్మజః :- రథ్ ధాతువు నడిచేదానిని సూచిస్తుంది. పదిదిక్కులయందు నడిచే రథముకలవాడు. పది ఇంద్రియములు కల ఆత్మ -దశరథుడు. ఆత్మయందు అవతరించి ఆనందమునిచ్చు పరమాత్మ దాశరథి - విష్ణువు శ్రీమన్నారాయణుడే. ఇవి ఆధ్యాత్మిక విశేషార్థాలు. ఈ పదాలు అవతారంలో ఉన్న రాముని , పరమపదంలోని శ్రీమన్నారాయణుని కూడా సూచిస్తాయి. వరము కోరుకోమన్నాడు. శ్రీమన్నారాయణుడు. భద్రుడు వరంకోరుకున్నాడు... స్వామీ ఇలాగే నాశిఖరమున ఉండి లోకాలను అనుగ్రహించమని. అట్లే యని... 

శంఖచక్ర ధనుర్బాణ జానకీ సహితః ప్రభుః , వైకుంఠవత్సదా తస్మిన్ వైకుంఠ పుర వాసిభిః।। 

శంఖచక్రములు ధనుర్బాణాలు ధరించి జానకీ సహితంగా వైకుంఠవాసులతో వైకుంఠం నందు ఉన్నట్లు సదా ఉంటానన్నాడు. 

 జానకి :- జననాత్ ప్రబ్రుతిః కం ఉపాసతే జనకః ! జన్మించినది మొదలూ పరబ్రహ్మనే ఉపాసించు మహాత్ములు ఋషులు జనకులు. వారి మనస్సులనే యాగభూమియందు అవతరించి లోకాలనానిందింపచేసే భగవంతుని కరుణ జానకి. యోగుల మనస్సు లనే పొలమున దున్నగా లభించింది కనుక సీత. సీర్యతే ఇతి సీత

 ఇప్పుడు చెప్పండి... భద్రాచలంలోని రాముడిని రామనారాయణుడని అచ్యుత గోత్రముతో చెప్పుట దోషమెట్లు.

 శివరాముడుని చేసేయాలనే యావతో , లోపల శివలింగం పెట్టేయాలి అనే తొందరపాటు. అలా దానిని ఆక్రమించి, అనేకమందిని ఆకర్షించేవిధముగా వాళ్ళు  దేవతలనుకునేవన్నీ అందులో పెట్టేసి, హిందూ వ్యాపారకేంద్రముగా చేసి, అటురాజకీయనాయకులు ఇటు స్మార్తబ్రాహ్మణులమని చెప్పుకునే బ్రాహ్మణ బంధువులు కలసి వారి వారి ప్రయోజనాలను సాధించుకోవడానికి అనువుగా.... అనేకరకముల వివాదాలకు తెగబడుట జరుగుతోంది. 

 ఎక్కడైనా బాగా నడుస్తున్న వైష్ణవ క్షేత్రాలను వివాదాస్పదం చేసి తమ ఆధిపత్యం లోనికి తెచ్చుకోవాలని చూసే ఒకవర్గం యొక్క పంటపండేవిధంగా ...అక్కడకు ఏనాడూరానివారు, కనీసం రామదాసు పరంపర తెలియనివారు, రామదాసు సాహిత్యములో కనీస జ్ఞానం లేనివారు రామదాసుగారి వంశస్థులమని చెప్పుకునే కొందరు స్వార్ధం వలన ఈ వివాదం రక్తికట్టింది.

 "కన్నమువేయ వచ్చినవాడు ఇల్లు కూల్చతలచెను" 
 అనే సామెత గుర్తుకొస్తుంది. 

కామెంట్‌లు