తిరుప్పావై వ్రతం
ఉపోద్ఘాతము - ఉజ్జీవించిబ్రతుకుదాం
జ్ఞానం కల్గి ఉన్నది మానవ జన్మ, ఇది . దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒక ఉత్తముడి లక్షణం అని మన ఋషులు అందించిన వైదిక సంప్రదాయం. అదే ఆర్షవాణి . మరి లక్ష్యమేమిటో తెలిసింది, దాన్ని ఎలా సాదించటం ఏదో ఒక మార్గం కావాలి కదా. మనపెద్దలు అక్కడికి చేరడానికి ఒకమార్గాన్ని తయారు చేసి ఇచ్చారు. మనం మన పూర్వులు నడిచిన దారినే నడవటం సబబు. వారంతా మనకు తత్వాన్ని దర్షించి మనకు మార్గాన్నీ చూపారు. మార్గం ఏమిటో తెలిసింది,మార్గ నిర్దేషం చేసేవారొకరు కావాలికదా. భగవంతుని కోసం ఎంతో మంది తపించారు . ఆయన ఇష్టంతో కొందరిని కోరాడు, వారినే ఆళ్వారులని అంటారు. అందులో గోదాదేవి-ఆండాళ్ ఒక ఆళ్వారు. ఆమెను తాను స్వయంగా స్వీకరించాడు. మరి ఆమెనే మన మార్గ నిర్దేషం చేసే ఆచార్యునిగా తీసుకుందాం. మనకున్న కొద్ది సమయంలో రామాయణభాగవతాదులను చదవాలంటే చాలా కష్టం. ఒక అతి సులభమైనది ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. ఆ కోవలోకే గోదాదేవి పాడిన "తిరుప్పావై" వస్తుంది. మనం తిరుప్పావైని ఒక వాహనంగా భావిస్తూ పయనిద్దాం. అతి సులువైనది కేవలం ముప్పై పాటలు మాత్రమే ఉంటాయి. ఏమిటా తిరుప్పావై? చూడటానికి పైపైకి ఒక కృష్ణ-గోపికల కథగా కనిపిస్తుంది. ఒక దూది పువ్వుని విప్పుతూ పోతే ఎలా విస్తరించగలదో తిరుప్పావై ఒక్కో పాటలో విప్పి చూస్తే అందులో గంభీరమైన రహస్యాలు కనిపిస్తాయి. ఇందులో రామాయణ భాగవత సన్నివేశాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇకపై వేదాలు ఉపనిషత్తులు చూపిన మార్గం ఇమిడి ఉంది. అందుకే తిరుప్పావైని ఐదో వేదం అంటారు. మరి అందరూ చెయ్యవచ్చా? శ్రీకృష్ణుడి కోసం చేసేది "నీవే తల్లివి తండ్రివి ....." అని అందరం చిన్నపుడు చదివిందేకదా, అందరూ చెయ్యవచ్చు ఈ వ్రతం. ఎప్పుడు ఆచరించాలి? ఒక రైతు పంట పండించేందుకు నారు పోయటానికి ఒక సమయం అంటూ చూసుకుంటాడు కదా, ఒక విధ్యార్థి. మరి జీవిత లక్ష్యమైన శ్రీకృష్ణుని కోసం చేసే వ్రతానికి ఒక మంచి సమయమే ధనుర్మాసం. సూర్యుడు ధనుః రాశిలో ప్రవేశించి ఉంటాడు. ఆంగ్ల మానం ప్రకారం డిసెంబరు 16 నుండి మొదలై సంక్రాంతి వరకు. ఈ మాసం మనకు జ్ఞానం ఇచ్చే మాసం. వ్రతం చేయటం కష్టం కాదా? కాదు, ఇది అతి సులభమైనది. తెలతెల వారే సమయంలో స్నానం చేయ్యటం, ఆరోజు పాశురం చదివి, ఆపై శ్రీకృష్ణుడికి పొంగలి ఆరగింపు చేయటం. ఇక ఆయా పాశురాల అర్థం వినడం అంతే. శరీరాన్ని కష్టపెట్టే వ్రతం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలతో స్నానం చేయటమే ఈ వ్రతం. వ్రతం చేద్దాం కానీ ఫలితం లభిస్తుందా? అంటే ఏమీ సంశయం అవసరం లేదు అని ఆండాళ్ తల్లి చెబుతుంది. ఒక చిన్న పిల్లవాడు తప్పుచేస్తే తప్పును కప్పి తండ్రి దరిని చేర్చే అమ్మలా మనకోసం ఆండాళ్ తల్లి వేచి ఉంది. గోదాదేవి నడిచిన మార్గాన్ని చూపించిన శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి ఉదేశమును అనుసరించి ధనుర్మాసోత్స వాలలో తరిద్దామ్. |

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి