స్కాందపురాణంలో ద్వారకా మహత్యమునందు విష్ణు ధర్మోత్తరఖండమందు ఇలా ఉంది.
సంప్రార్ధ్య విధివన్మాలాం కృష్ణగళార్పితాం
ధారయేత్ కార్తికే యోవై సగచ్చేద్వైష్ణవం పదం ।।
విధిప్రకారముగా చేసిన తులసిమాలను కృష్ణుని మెడలో అలంకరించి తీసి ఈ కార్తీకమాసం లో ధరించిన మానవుడు విష్ణు స్థానమును చేరును.
పద్మపురాణం పాతాళ ఖండండంలో 79వ అధాయాయంలో చెప్పబడింది.
తులసీ కాష్టమాలాయా భూషితః కర్మ ఆచరన్
పితౄణం దేవతానాంచ కృతం కోటిగుణం భవేత్
తులసిమాల కంఠమున ధరించి చేసే పితృకర్మలుగానీ దేవకర్మలుగానీ కోటిరెట్లు ఫలితమునిస్తాయి.
తులసిమాల ధరించే ధరించేటప్పుడు ఇలా స్మరించాలి
తులసీ కాష్ట సంభూతే మాలే కృష్ణ జనప్రియే
బిభర్మిత్వామహం కంఠే కురుమాం కృష్ణ వల్లభాం
తులసీకాండముతో చేయబడిన ఓ తులసిమాలా! వైష్ణవులకు ఇష్టమైన ఓ తులసిమాల! నిన్ను నా కంఠమున ధరిస్తున్నాను... నన్ను విష్ణు భక్తునిగా చేయుము. అని ప్రార్ధించి ధరించాలి. అని విష్ణు ధర్మోత్తరంలో చెప్పబడింది.
తులసీ కాష్టఘటితైమణిభిర్జపమాలికా
తులసి కాండముతో చేయబడిన పూసలు గల మాలతో జపము చేయవలయునని రామార్చన చంద్రిక మొదలగు అనేక గ్రంధములలో కనిపిస్తోంది.
తులసిమాల అంటే తులసిచెట్టుకాండముతో చేసినది. ఎండిపోయిన తులసిచెట్టు కాండముతో గుండ్రముగా పూసలుచేసి దానికి ఆవునేయి పసుపు కలిపి పూసి ఒకదినమంతా ఉంచాలి. తరువాత నీటితో కడిగి పంచగవ్యములలో ఒకదినం ఉంచాలి. ఆతరువాత నీరుతో కడిగి సంప్రోక్షణచేసి విష్ణుగళమున అలంకరించి స్వీకరించాలి. ఇలాంటి తులసిమాల జపము చేసుకోవడానికి లేదా కంఠమునందు ధరించడానికి చాలా మంచిది.
కంఠమున ఒకసారి ధరిస్తే అది జపమునకు పనికిరాదు. జపమాల విడిగా ఉండాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి