ముదళాల్వారులు
తిరుక్కోవలూరు (తిరుక్కోయిలూరు )(Tirukkoyilur)
ఆళ్వారులు అనగా భగవంతుని అనుగ్రహమును పొంది అనుభవించి
దివ్యప్రబంధములద్వారా భగవంతుని లోకానికి అందించినవారు.
పన్రెండు(12)మంది ఆళ్వార్ లు.
ముదలాళ్వార్లు (మొదటి ఆళ్వారులు) ముగ్గురు.
పొయ్‌గాళ్వార్ :- అదించిన దివ్యప్రబందం 'ముదల్ తిరువందాది'(మొదటి తిరువందాది)
2. పూదత్తాళ్వార్ :-అదించిన దివ్యప్రబందం 'ఇరణ్డాన్ తిరువందాది' (రెండవ తిరువందాది)
3. పేయాళ్వార్ :- అదించిన దివ్యప్రబందం 'మూన్ఱాన్ తిరువందాది' (మూడవ తిరువందాది) 1.
. ఆదరణ ఆప్యాయత కలవారిని భగవంతుడు ఆశ్రయిస్తాడు. ఇది మన భారతీయ వైదిక సంప్రదాయం విశ్వాసం. ఇది నిరూపించడానికి ఈగాథ ప్రచారంలో ఉంది.
ఇది "తిరుక్కోవలూర్‌లో " అనే గ్రామంలో జరిగింది .
వర్షం కురుస్తున్న ఒక చీకటిరాత్రి పోయ్‌గై ఆళ్వారు అనే మహానుభావులు ఒక ఇంటి యజమాని అనుమతి తీసికొని ఆయింటి చిన్న అరుగుపైన పడుకొని భగవధ్యానము చేసికొంటున్నాడు. కొంత సేపటికి పూదత్తాళ్వారు అనేవారు ఆత్రోవలో వెల్తుంటే పోయ్‌గై ఆళ్వారు వారిని పిలిచారు. అక్కడికి వచ్చి పూదత్తాళ్వారు - 'ఈ అరుగు మీద ఒకరే పండుకొనవచ్చును. మీకు ఇబ్బంది కలుగునేమో " అంటే... "ఇద్దరమూ కూర్చుండవచ్చును" అని పూదత్త ఆళ్వారును ఆహ్వానించారు.
మరి కొంత సేపటికి పేయాళ్వాఱు అనేవారు ఆత్రోవలో వెల్తుంటే పోయ్‌గై ఆళ్వారు పూదత్తళ్వారు కలసి వారిని పిలిచారు. పేయాళ్వ్వారు - "ఈ అరుగు మీద మీరు ఇద్దరే కూర్చోగలరు." అంటే... "ముగ్గురమూ నిలుచుండవచ్చును' అని మూడవవారైన పేయాళ్వారునీ ఆహ్వానించారు.
ఆ రాత్రిపూట - కన్ను పొడుచుకున్నా కానరాని ఆ కటిక చీకటిలో - ఈ ముగ్గురూ భగవద్గుణాలను చెప్పుకుంటూ ఉన్నారు. వారిలోని సహృదయతకి భక్తికి పరరవశించి శ్రీ హరి అదృశ్యరూపంలో వచ్చి వారినడుమ నిలిచి చిందులు వేయసాగాడు.
తమ మధ్య మరొకరు ఎవరో ఉన్నారని ఆళ్వారులు గ్రహించారు. ఆ ముగ్గురూ... ఆ వచ్చిన వానిని గుర్తించటానికి ... సమాజాన్నే ప్రమిదగా చేసి, దానిలో సర్వజీవులయందూప్రేమ అనే నెయ్యిపోసి, జ్ఞానం అనే దివ్యదీపం వెలిగించారు. అలాంటి దీపకాంతిలో.. సుదర్శన చక్రధారియై శ్రీమహాలక్ష్మితోపాటు శ్రీహరిని చూసారు...!
ఈముగ్గురూ అడిగారు ... "నిన్ను మేము పిలువలేదే ...! నీవెందుకు వచ్చావయ్యా ...?" అని.
" సాటివారియందు ప్రేమ ఆప్యాయత కలిగి, సర్వజీవులయందూ అనురాగంకలిగి, నాయందు భక్తికలిగినవారు కలసిన చోట నేను ఆననందపరవశుడనై నాట్యంచేస్తాను . " అన్నాడు శ్రీహరి.
ఇలా ఆ మహనీయుల భగవద్దర్శన కాంక్ష ఒకేమారు నెరవేరింది - అని శ్రీవైష్ణవ సంప్రదాయ గాథలలో చెబుతారు. వైష్ణవ దేవాలయాలలో ఆరాధించే పన్నెండుగురు ఆళ్వారుల లో ఈముగ్గురూ ముదలాళ్వార్లు అనగా మొదటి ఆళ్వారులు.
వీరు భగవంతుని కీర్తిస్తూ గానం చేసి మనకందించిన దివ్యప్రబందం "ముదల్ తిరువందాది" అని ప్రసిద్ది పొందినది. ప్రతి పాశురమునకు చివరి పదము (అంతము) తరువాతి పాశురమునకు మొదటి పదము (ఆది) గా నుండుట వలన ఈ పాశురములు "అందాది" (ముక్తపదగ్రస్త గేయాలు) అనబడ్డాయి. ఇవి 300పాశురములతో (పాటలతో) కూడిన దివ్యప్రబంధాలు.
1. పొయ్‌గాళ్వార్ :- కాసార యోగి, సరోయోగి అని కూడా అంటారు వీరిని. ఆళ్వారులలో మొదటివారు వీరు. ద్వాపర యుగమున 8,60,900వ సంవత్సరమైన సిద్ధార్థినామ సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ అష్టమి జయవారము శ్రవణ నక్షత్రమున కాంచీ నగరములో యధోక్తకారి సన్నిధియందలి పుష్కరిణిలో తామర పుష్పమున అవతరించారు. 'పొయ్‌కై' అనగా చెరువు. సరసునందు అవతరించినందువలన 'పొయ్‌కై ఆళ్వార్' అని పిలువబడ్డారు. శ్రీ మహా విష్ణువు శంఖమైన పాంచజన్య అంశావతారము. పొయ్‌గైయాళ్వార్ పాడిన నూరు పాశురములు... 'ముదల్ తిరువందాది' (మొదటి వంద ముక్తగ్రస్త గేయాలు) . దివ్య ప్రబంధాలలో ఇవి మొదటి భాగము. ఈ ముదల్ తిరువందాదిలో శ్రీరంగము, కంచి, తిరుమల, తిరుక్కోవలూరు దివ్య దేశములలోని సర్వేశ్వరుని స్తుతించారు.
ఈ ఆళ్వారు తిరునక్షత్ర తనియన్ (జయంతోత్సవంలో కీర్తించే శ్లోకములు)
తులాయాం శ్రవణే జాతం । కాఞ్చ్యాం కాఞ్చన వారిజాత్ ।।
ద్వాపరే పాఞ్చజన్యాశం । సరోయోగి సమాశ్రయే ।।
కాంచ్యాం సరసి హేమాబ్జే । జాతాం కాసార యోగినమ్ ।।
కలయే యశ్శ్రియఃపత్యా । రవిన్దీప మకల్పయత్ ।।
2. పూదత్తాళ్వార్ :- ఆల్వారులలో రెండవవారు పూదత్తాళ్వార్.భూతాహ్వయుడనీ, మల్లపురాధీశుడనీ ఇతని నామాంతరములు. వీరు ద్వాపర యుగమున 8,60,900వ సంవత్సరమైన సిద్ధార్థినామ సంవత్సరము ఆశ్వయుజ మాసము శుద్ధ నవమి బుధవారము ధనిష్టా నక్షత్రమున (పొయ్‌గై ఆళ్వారు అవతరించిన మరుసటినాడు) మహాబలిపురము (తిరుక్కడల్మల్లై) లో బండి గుఱిగింజ పూవులో అవతరించారు. 'పూతము' అనగా యదార్ధము, ఆత్మ అని అర్ధాలు. తన పాశురాలలో యదార్ధమును చెప్పినందువలనా, సర్వేశ్వరునికి ఆత్మగా ఉన్నందువలన ఇతనికి 'పూదత్తాళ్వార్' అన్నపేరు వచ్చింది. శ్రీ మహా విష్ణువు గదాయుధమైన కౌమోదకి అంశావతారము వీరు. పూదత్తాళ్వార్ పాడిన నూరు పాశురములు 'ఇరణ్డాన్ తిరువందాది' (రెండవ వంద ముక్తగ్రస్త గేయాలు) అనబడుచున్నాయి. దివ్య ప్రబంధాలలో ఇవి రెండవ భాగము. ఈ ఇరణ్డాన్ తిరువందాదిలో శ్రీరంగము, తిరుమల, మహాబలిపురము, తిరుక్కోవలూరు, కంచి, అడకసింగరు, తిరుక్కోట్టియూర్, తిరునీర్మలై దివ్య దేశములలోనిసర్వేశ్వరుని స్తుతించారు.
ఈ ఆళ్వారు తిరునక్షత్ర తనియన్ :
తులా ధనిష్ఠా సంభూతం భూతం కల్లోలమాలినః ।
తీరే ఫుల్లోత్పలేమల్లా పుర్యామీడే గదాంశకం ।।
మల్లాపుర వరాధీశం మాధవీ కుసుమోద్భవమ్ ।
భూతం నమాఙియోవిష్ణోః జ్ఞానదీపమకల్పయత్ ।।
3. పేయాళ్వార్ :- ఆళ్వారులలో మూడవవారు పేయాళ్వార్. వీరికి మహదాహ్వయులు, మహాయోగి అనే పేర్లు కలవు. భగవధ్యానములో మైమరచి పిచ్చివానివలే సంచరించినందున ఇతనికి 'పేయ్' (పిచ్చి) ఆళ్వార్ అనే పేరు వచ్చింది. వీరు ద్వాపర యుగమున 8,60,900వ సంవత్సరమైన సిద్ధార్ధి సంవత్సరము ఆశ్వయుజ మాసము శుద్ధ దశమి గురువారము శతభిషా నక్షత్రమున (పొయ్‌గై ఆళ్వారు అవతరించిన రెండవనాడు, పూదత్తాళ్వార్ అవతరించిన మరుసటినాడు) చెన్నపట్టణం సమీపంలోని మైలాపురిలో మణికైరవం అనే బావిలో ఎర్రకలువ పుష్పంలో అవతరించారు. శ్రీ మహా విష్ణువు ఖడ్గాయుధమైన నందకముయొక్క అంశావతారము వీరు. పన్నెండుమంది ఆళ్వారుల లో ఒకరైన తిరుమళిశయాళ్వార్ (భక్తిసారులు) వీరి శిష్యులే...! పేయాళ్వార్ పాడిన నూరు పాశురములు 'మూన్ఱాన్ తిరువందాది' (మూడవ వంద ముక్తగ్రస్త గేయాలు) అనబడుచున్నాయి. ఈ మూన్ఱాన్ తిరువందాదిలో శ్రీరంగము, తిరువల్లిక్కేణి, కాంచి, తిరుమలై, తిరువెక్కావేళుక్కై, తిరుక్కుడన్‌దై, తిరుక్కోట్టియూర్ దివ్య దేశములలోనిసర్వేశ్వరుని స్తుతించారు.
ఈ ఆళ్వారు తిరునక్షత్ర తనియన్:
దృష్ట తుష్టావయో విష్ణుం రమయా మయిలాధిపం ।
కూపే రక్తోత్పలే జాతం మహదాహ్వయ మాశ్రయే ।।
తులా శతభిషగ్జాతం మయూర పురికైరవాత్ ।
మహాన్తమ్ మహదాఖ్యాతం వన్దే శ్రీ నందకాంశకమ్ ।।
ఈ ఆళ్వారులు ముగ్గురుకీ ఆచార్యులు విశ్వక్సేనులే...
ముగ్గురు కలసిన చోటు తిరుక్కోవలూరే.
శరీరాన్ని విడచి పరమాత్మ సన్నిధికి వెల్లినదికూడా తిరుక్కోవలూరే.
ఈ ముగ్గురు ఆళ్వారుల ఆరాధ్య దైవంకూడా తిరుక్కోవలూరు నందు ఉండే ఆళ్వార్కళ్ ఆయనార్(ఆళ్వార్ గళ్ నైనార్ లేదా నాయనార్) అంటే ఆళ్వారుల స్వామి...!
తిరుక్కోవలూరు - ఆళ్వార్కళ్ ఆయనార్
తిరుక్కోవలూరు అంటే పవిత్రమైన ఆలయమున్న గ్రామం అని అర్ధం. 'తిరువిక్రమన్' + 'కోవిల్' + 'ఊరు' = తిరుక్కోవిలూరు అని.
ఆయనార్ అంటే గోపాలుడు. ఇక్కడ త్రివిక్రముడిగా ఉంటాడు స్వామి. తిరుక్కోవలూరు లేదా తిరుక్కోయిలూరు (Tirukkoyilur) సంస్కృతం లో గోపపురం అంటారు.
అతి ప్రాచీనమైన పంచ కృష్ణారణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. శ్రీకృష్ణుని నిత్యసాన్నిధ్యము కలక్షేత్రము.
ఇక్కడి త్రివిక్రమ స్వామి దేవాలయం 108 వైష్ణవ దివ్యదేశాలలో మొదటిది ( ఆల్వారులచే కీర్తించబడిన మొదటి దివ్యదేశం) .
ఇచట మూలవర్ త్రివిక్రమన్... కుడిపాదము పైకి ఎడమపాదము క్రిందకు గలదు. మరియు కుడిచేత శంఖము ఎడమచేత చక్రము ధరించియుందురు.
ఈ స్వామిని తిరుక్కోవలూరు ఆయనార్ అనికూడా అంటారు. తిరుక్కోవలూర్ ఆయనార్ అంటే ఆ ఊరికి చెందిన గోపాలుడు అని అర్ధం .
తమిళనాడు రాష్ట్రం, విల్లుపురం జిల్లా (పూర్వ దక్షిణ ఆర్కాట్ జిల్లా) లో ఉంటుంది ఈ తిరుక్కోవలూరు. ఇది తిరువణ్ణామలైకు దక్షిణంగా 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈదివ్యదేశం.
మీనంమాసం (అనగా సూర్యుడు మీనరాశిలో ఉన్నప్పుడు) ఉత్తరా నక్షత్రం నాడు... తీర్థోత్సవము-...! వృశ్చికమాసము కైశికి ఏకాదశి నాడు గొప్ప ఉత్సవం జరుగును. మరునాడు ద్వాదశి రోజున ఎంబెరుమానార్ జీయర్‌కు (భగవద్రామానుజులకు) బ్రహ్మరథోత్సవం జరుగును. ఇక్కడి త్రివిక్రమ స్వామి దేవాలయం 108 వైష్ణవ దివ్యదేశాలలోమొదటిది ( ఆల్వారులచే కీర్తించబడిన మొదటి దివ్యదేశం) .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి